ప్రజాభేరి సభను విజయవంతం చేయాలి.. మాజీ మంత్రి జూపల్లి
ఈనెల 31న కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ లో నిర్వహించే ప్రజాభేరి సభకు ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ, వీపనగండ్ల : ఈనెల 31న కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ లో నిర్వహించే ప్రజాభేరి సభకు ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొర్లకుంటలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ రుణాన్ని తీర్చుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సైనికుడిలా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ హాయంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ బీసీ సెల్ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, నాయకులు సుదర్శన్ రెడ్డి, చక్ర వెంకటేష్, మౌలాలి, గోపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.