రసకందాయంలో జడ్చర్ల రాజకీయం

జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం జడ్చర్లలో కొనసాగుతున్న రాజకీయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నది.

Update: 2023-11-29 10:31 GMT

దిశ, జడ్చర్ల/నవాబుపేట : జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం జడ్చర్లలో కొనసాగుతున్న రాజకీయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నది. అందుకు ముఖ్య కారణం జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనంపల్లి అనిరుద్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని తన సొంత ఇంటికే పరిమితమై హౌస్ అరెస్ట్ పేరుతో స్వయంగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో జడ్చర్ల రాజకీయంపై యావత్ తెలంగాణ దృష్టి పడింది.

అనిరుద్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి ఉండటం, ఆయన ఇంట్లోనే ఉండి వీడియోలు రిలీజ్ చేయడం, పోలీసులు ఆయన హౌస్ అరెస్టును ధ్రువీకరించకపోవడం లాంటివి చాలా సేపు కొనసాగడంతో ఆయన వైఖరిని నిరసిస్తూ, ఆయన ఆరోపణలను ఖండిస్తూ ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే సోషల్ మీడియాలో వీడియోలు ఖండనలు పెట్టడంతో జడ్చర్ల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో తనపై గెలుపొందలేక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనను హౌస్ అరెస్ట్ చేయించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశాడని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుట్రలను ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ గమనించి, తనకు అండగా నిలిచి ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలోని ఓటర్లను కోరుతూ వీడియో రిలీజ్ చేశారు.

అయితే ఆయన హౌస్ అరెస్టుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అందుకు ప్రతిగా పోస్టులు పెట్టడంతో నియోజకవర్గంలో రాజకీయం రచ్చ రచ్చగా మారింది. ఓడిపోతా ననే భయంతో అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలోని రంగారెడ్డి గుడిలో గల సొంత ఇంటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వీడియోలు రిలీజ్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ లు ఇవ్వడం, వీడియోలు రిలీజ్ చేయడంతో నియోజకవర్గం లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో హౌస్ అరెస్టులు అనేవి ఉండవని వ్యక్తిగత ఆరోపణలపై విచారించేందుకు వచ్చిన పోలీసులను కలవడానికి అనిరుద్ రెడ్డి అయిష్టత వ్యక్తం చేసినందుకే హైదరాబాద్ లోని ఆయన ఇంటి దగ్గర హైడ్రామా నెలకొందని, బీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల వాద ప్రతివాదాలతో జడ్చర్ల నియోజకవర్గంలో నెలకొన్న అనిక్షిత పరిస్థితులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. నియోజకవర్గంలో మామూలు పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం చేపట్టాల్సిన అవసరం ఉన్నదని లేకుంటే ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా ఈ విషయంలో నిజాలను నెగ్గుతేల్చి అందరి సమన్వయంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ విషయంలో ఇరు పార్టీల నాయకుల,కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని వారు వారంటు న్నారు. అలాంటప్పుడే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల పోలింగ్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News