గుప్తనిధుల కోసం గణపతి విగ్రహం ధ్వంసం..
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ పురాతన రాతి గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది.
దిశ, కొల్లాపూర్ (కోడేరు) : నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ పురాతన రాతి గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పురాతన రాతి గణపతి విగ్రహం లోపల వజ్రాలు నిక్షిప్తమై ఉన్నాయంటూ గతంలో ఎన్నోసార్లు ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే భూమి లెవెల్ లో పూడుకుపోయి ఉన్న 7వ శతాబ్దం చాళుక్యుల కాలం నాటి గణపతి విగ్రహాన్ని మంగళవారం రాత్రి తాళ్ళు కట్టి బయటకు తీయడానికి దుండగులు విఫల ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తీరా గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుండగుల అలికిడి విన్న గ్రామస్తులు కేకలు వేయడంతో పరారయ్యారు. మంగళవారం ఉదయం గ్రామస్తులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాకతీయుల కాలం నాటి విగ్రహాన్ని గుప్తనిధుల కోసం ధ్వంసం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బస్టాండ్ కూడలిలో గ్రామస్తులతో కలిసి రాస్తారోకో చేశారు. నిందితులను గుర్తించడానికి క్లూస్ టీంను తెప్పించి పోలీసులు సీరియస్ గా కేసును దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ అఖిలపక్ష నాయకులు, మైనార్టీ నాయకులు గ్రామస్తులు డిమాండ్ చేశారు.