ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొంత స్తబ్దుగా ఉన్న పాలమూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొంత స్తబ్దుగా ఉన్న పాలమూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సాగుతున్న పరస్పర విమర్శలు పతాక స్థాయికి చేరాయి. కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చలకు తెరలేపాయి. 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం, అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. 2019లోనూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఆయన మంత్రి కావడంతో రాజకీయాలు మారిపోయాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న క్రిస్టియన్ పల్లిలోని 523 సర్వే నెంబర్ భూములలో నాలుగో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్ కావడం, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వరద భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ హీట్ పెరిగింది.
తన సోదరుడు జైలుకు వెళ్లడం, తన అనుచరుడు, సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన పార్టీ ముఖ్య నాయకులు, పోలీస్ స్టేషన్‌లో ఎదుట ఆందోళనకు దిగడం, పోలీసులపై విమర్శలు చేయడంతో చివరకు ఆయనపై కూడా కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టిన విషయం గుర్తుకు రావడం లేదా..!? అప్పుడు తాము తప్పులు చేయకపోయినా కేసులు పెట్టారని, ఇప్పుడు తప్పు చేసినందుకు కేసులు నమోదు అయ్యాయని కాంగ్రెస్ నేతలు ఘంటాపథంగా ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో అరెస్టు కాబడిన నాయకులు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మీడియా సమావేశాలలో మండిపడుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాచారం ఇవ్వడంతో.. కేటీఆర్ నాయకులు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో నాయకులు కార్యకర్తలు అధికార పార్టీ నాయకులను గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధుసూదనాచారి, తదితర నేతలను ఆహ్వానించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రోజురోజుకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర విమర్శలు.. ప్రతి విమర్శలు పాలమూరు రాజకీయాలలో రసవత్తర చర్చలకు తేరలేపుతున్నాయి.