Police cases : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పోలీస్ కేసులు

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించాడని ఆరోపిస్తూ

Update: 2024-10-31 14:13 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించాడని ఆరోపిస్తూ ఆయన పై పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ వర్థ భాస్కర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడని, బుధవారం ఉదయం అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయనను తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తూ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బుధవారం బైఠాయించిన సంగతి విధితమే.

గతంలో అనేక సార్లు వర్ద భాస్కర్ సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్,ఆయన తమ్ముడి పై పోస్టులు కూడా పెట్టాడని,వారి ఫిర్యాదు మేరకు ఇదే స్టేషన్ లో రెండు కేసులు కూడా నమోదు అయ్యాయని సిఐ తెలిపారు. మళ్ళీ అదే తరహాలో వర్థ భాస్కర్ ప్రవర్తిస్తుంటే గతంలో పోలీస్ స్టేషన్ కు పిలిచి మందలిస్తే,ఇకపై ఎలాంటి మెసేజ్లు పెట్టనని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడని, అయినా ఆయన తీరు మార్చుకోకుండా,తిరిగి అదే కోవలో ప్రవర్థిస్తున్నందున,బుధవారం పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ చేసి స్థానిక తహసీల్దార్ ముందు బైరోవర్ చేసి పంపించామే కాని,ఆయనపై ఎలాంటి మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదని,కొట్టలేదని సీఐ స్పష్టం చేశారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి,విధులకు ఆటంకం కలిగించినందుకు బీఎన్ఎస్ అండర్ సెక్షన్ 132/24,189-క్లాస్-II,190,192,195-క్లాస్-I,196,292,352 ప్రకారం కేసులు నమోదు చేశామని సీఐ వివరించారు.


Similar News