కొడంగల్ నియోజకవర్గంలో BRS నేతలను అరెస్టు చేసిన పోలీసులు

బి.ఆర్.ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన కొడంగల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-09 07:07 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: బి.ఆర్.ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన కొడంగల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నియోజకవర్గం‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పాదయాత్ర నిర్వహించేందుకు బయలుదేరిన BRS నేతలను నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటును కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు అంటూ వారికి మద్దతుగా నియోజకవర్గంలో వాటిని ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం నుండి దుద్యాల మండలం వరకు పాదయాత్ర నిర్వహించేందుకు బి ఆర్ ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాదు నుండి ఈ పాదయాత్ర నిర్వహించేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులను బొమ్రాజ్ పేట మండలం తున్కిమెట్ల గ్రామం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు పోలీసులు పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బి ఆర్ ఎస్ శ్రేణులను కోస్గి మండల పరిధిలోని హకీంపేట వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి చెదరగొట్టేందుకు చర్యలు చేపట్టారు. కాగా ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.


Similar News