పాలమూరు - డిండి ఎత్తిపోతల రద్దుకు ప్రజలు ఉద్యమించాలి.. ప్రొఫెసర్ హరగోపాల్
పాలమూరు - డిండి ఎత్తిపోతల పథకం ప్రతిపాదన రద్దు కావాలంటే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పాలమూరు - డిండి ఎత్తిపోతల పథకం ప్రతిపాదన రద్దు కావాలంటే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. డిండి ఎత్తిపోతల పేరున నీటి తరలింపు ఆపాలని, గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం ఆపాలని, కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను సాధించాలనే తదితర అంశాల పై ఆదివారం స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల నీటి కేటాయింపులకై 1950 లో ఏర్పాటైన రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ అయిన ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేయడం ద్వారా రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆయన విమర్శించారు. ఈనాడు రాజకీయ, అధికార, ఆర్థిక ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల బాగు గురించి ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు.
గతంలో కేసీఆర్ పాలమూరు గురించి ఎన్నో హామీలు ఇచ్చి అన్ని మరిచిపోయారని, రాష్ట్రంలో ఎక్కడ చర్చ జరిగినా పాలమూరు నీటి సమస్య, కరువు, వలసల గురించే మాట్లాడుతారని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక, పాలమూరు సమస్యల గురించి మాట్లాడడమే మరిచిపోతారని ఆయన ఆరోపించారు. పాలమూరు సమస్యలు రాజకీయ పార్టీలతో పరిష్కారం కావని, ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని, ఉద్యమాలు ద్వారా ప్రజలు చైతన్య పడతారని, పాలమూరు ప్రజలు పోరాటంతోనే నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. టీజెఏసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వంత జిల్లా నుండి నీటి తరలింపు ఆలోచన మానుకోకుంటే అప్రతిష్ట పాలవుతారని, డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కేసీ.వెంకటేశ్వర్లు తీర్మానాలు ప్రవేశ పెట్టగా,సభ్యులు ఆమోదించారు. అనంతరం సమావేశ మందిరం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తిమ్మప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్వీనర్ రాఘవాచారి, ఖలీల్, వెంకటేష్ గౌడ్, వెంకట్రాములు, సుదర్శన్, నారాయణ, హన్మంతు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.