రహదారి భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
రహదారి భద్రత పై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు
దిశ, నారాయణపేట ప్రతినిధి : రహదారి భద్రత పై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ తో సమావేశానికి రావాలని అధికారులకు సూచించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపరంగా రోడ్డు భద్రత పై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా చేప్పట్టిన కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని 6 బ్లాక్ పాయింట్లను గుర్తించడం జరిగిందని, అందులో మాగనూరు మండలం గుడే బల్లూరు, మక్తల్ పట్టణం, మరికల్, పెద్ద చింతకుంట, అప్పంపల్లి, కోస్గి మండలంలోని నాచారం ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ నెల 10న జిల్లా కేంద్రoలో రోడ్డు భద్రత పై అన్ని శాఖల అధికారులు, పాఠశాల కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించాలని, ఈ నెల 18న జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఆటో డ్రైవర్లు, కమర్షియల్ టాక్సీ డ్రైవర్లకు ఓ ఫంక్షన్ హల్ లో పెద్దఎత్తున అవగాహన సదస్సును నిర్వహించేందుకు సమావేశంలో కలెక్టర్, ఎస్పీ నిర్ణయించారు. జిల్లా కేంద్రంతోపాటు, మక్తల్ కోస్గి సర్కిళ్ల పరిధిలో సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వైర్ లెస్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల గురించి ఆరా తీసిన కలెక్టర్ కేవలం ఆర్టీవో కార్యాలయం పరంగా అవగాహన కార్యక్రమాలు చేసి వదిలేస్తే ఎలాగని ఆర్టీవో మేఘా గాంధీని ప్రశ్నించారు. ఏదైనా కార్యక్రమం చేసే ముందు సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చి వారిని ఆయా కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలన్నారు.
గడువులోపు అనుమతులు ఇవ్వాలి...
నిర్ణీత గడువులోపు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో టీజీ ఐ పాస్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నెల నెల క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశపు ఎజెండాలోని వివిధ అంశాల గురించి పరిశ్రమల శాఖ జిఎం మహేశ్వర్ కలెక్టర్ కు వివరించారు. టీజీ ఐపాస్ కింద గత నవంబరు 7 వ తేదీ నుంచి ఈ నెల 6 వరకు పరిశ్రమల కై 14 అనుమతుల కోసం సంబంధిత శాఖలలో దరఖాస్తు చేసుకోగా..వాటిలో 9 అనుమతులు మంజూరయ్యాయని, 2 ప్రాసెస్ లో ఉన్నాయనీ, ఒకటి తిరస్కరించబడిందని,మిగతా 2 అభ్యంతరాలు ఉన్నాయని జీ.ఎం. తెలిపారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లకు చెందిన 17 దరఖాస్తుదారులకు సబ్సిడీ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.