బ్రేయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు

అన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం అవయవ దానం అని వారు భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు.

Update: 2024-06-18 03:52 GMT

దిశ, నారాయణపేట క్రైం: అన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం అవయవ దానం అని వారు భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు కన్న పేగు బంధాన్ని తెంచుకుని.. మరో నలుగురిలో తమ కన్న కొడుకుని చూసుకోవాలని ఉద్దేశంతో అవయవదానానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన రాహుల్ జడ్చర్ల పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఓ మెడిసిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. రాహుల్ గత ఐదు రోజుల క్రితం తన సొంత గ్రామం కోటకొండ నుంచి జడ్చర్ల కు వెళుతూ కోటకొండ అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని అడవి పంది ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకున్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రాహుల్ బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయినప్పటికీ తమ కుమారుడు మరణం మరో నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపాలని.. అవయవ దానం చేయాలని మృతుడి తండ్రి టైలర్ గణేష్ దంపతులు నిర్ణయించుకున్నారు. తమ కుమారుడి అవయవాలను దానం చేసి టైలర్ గణేష్ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలు పూర్తి చేసి యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మంగళవారం స్వగ్రామమైన కోటకొండలో అంత్యక్రియలు జరగనున్నాయి.


Similar News