బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవినీతి,కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక బూత్పూర్ రోడ్ లోని మూడా కార్యాలయంలో మూడా చైర్మెన్ గా లక్ష్మణ్ యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్థానిక జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో.. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్రలో ఉన్న ఈనాటి వరకు కూడా అంకితభావంతో పనిచేసే పార్టీయని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి పది మాసాలైనా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. వంద ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి లేని ఆస్తులు,బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయన్నారు. పార్టీకి నిధులు సమకూర్చుకొని,రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ఆ అప్పులకు నెలకు 6 వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. మూడా చైర్మెన్ గా లక్ష్మణ్ యాదవ్ కు,మున్సిపల్ చైర్మెన్ గా ఆనంద్ గౌడ్ కు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గా విజయ్ కుమార్ కు,స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ గా ఒబెదుల్లా కొత్వాల్ కు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. గతంలో మూడా కు ఒక్క రూపాయి నిధులు కేటాయించ లేదని,కేవలం నామమాత్రంగానే చైర్మెన్ ను నియమించి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. 260 కోట్ల అమృత్ నిధులు తెచ్చి ఘనత తమదేనని,పట్టణాన్ని అభివృద్ధి వైపు తీసుకపోతున్నామని ఆయన అన్నారు. మూడా చైర్మెన్ గా తనకు అవకాశం ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలైన యెన్నం శ్రీనివాస్ రెడ్డి,అనిధుర్ రెడ్డి,జి.మధుసూదన్ రెడ్డిలకు సహకరించిన అందరికీ లక్ష్మణ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒబెదుల్లా కొత్వాల్,మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కరి అనిత,వైస్ చైర్మెన్ విజయ్ కుమార్,సంజీవ్ ముదిరాజ్,ఎన్పీ వెంకటేష్,చంద్రకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.