తెలంగాణ పాలన దేశానికే దిక్సూచి.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి సాధనలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, వనపర్తి : సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి సాధనలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంతో పాటు వెనక్కి తండా, ముందరి తండా, కర్నె తండా, ఆముదం బండ తండా, షాపూర్, మానాజిపేట, మల్కాపూర్, దొంతికుంట తండా, రుక్కనపల్లి తండా, కోతులకుంట తండా, జగ్గయిపల్లి, సూరాయి పల్లి, ఉప్పరిపల్లి, సోలిపూర్ గ్రామాలలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజులలో కరెంట్ కష్టాలు, వ్యవసాయ బాధలు, వలసలు, పింఛన్ కోసం ఎదురుచూసే పరిస్థితులను ఒకసారి గుర్తుచేసుకుంటే తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి వల్ల ఎంత మార్పు వచ్చిందో అర్థం అవుతుందని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరిగింది కాబట్టి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారని, రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగినందుకు గాను రైతుబంధు దశలవారీగా రూ.16 వేలకు పెంచుతున్నామని, పొలం ఉన్న వాళ్లకు రైతు బీమా ఇస్తున్నామని అయితే భూమి లేని వారి పరిస్థితి అలోచించి సీఎం కేసీఆర్ ముందుచూపుతో వారందరికీ భీమాను అమలుచేయాలని సంకల్పించారని అన్నారు. గ్యాస్ ధర పది సంవత్సరాల నుండి పెరుగుతూనే ఉందని అందుకే ఈ దఫా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీ భరించి గ్యాస్ సిలిండర్ రూ.400 లకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ వ్యవసాయాన్ని అందరి ఆశీస్సులతో దేశంలో ముందు వరసలో నిలబెట్టా మన్నారు. తెలంగాణ పాలన, పథకాలు దేశానికి ఒక దిక్సూచిలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారు తెలంగాణ అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతున్నారని పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారని అన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి పథకాలపై ఏకంగా అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఆనాడు కరెంట్, సాగునీళ్లు, అన్ని రకాల వసతులు కల్పించి ఉండి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుండే .. అంత మంది అమరవీరులు ఆత్మ బలిదానాలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఒకసారి ప్రజలు అలోచించాలని కోరారు. 2014 కన్నాముందు 10 ఏండ్లు కాంగ్రెస్ పాలనే ఉన్నదని ఆనాటి కాంగ్రెస్ హయాంలో కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో 1లక్ష 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. అలాగే పారిశ్రామిక రంగంలో 16 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఆసరా పింఛన్, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతుభీమా, ప్రతి ఇంటికి మంచి నీళ్లు, రోడ్లు, ఇలాంటివి కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారని ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతున్నారని వారిని నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు.
40 ఏండ్ల నుంచి చిన్నారెడ్డి కాంగ్రెస్ ను పట్టుకుని ఉన్నాడని అలాంటిది డిల్లీకి పోయి సూటుకేసులు ఇస్తే చిన్నారెడ్డిని కాదని వేరే వాళ్లకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని ఇలాంటి వాళ్లు భవిష్యత్తులో 5 ఏండ్లు ఏం చేస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. నేను చెప్పే మాటలో సత్యం, దర్మం ఉంటే బీఆర్ఎస్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని హ్యాట్రిక్ పాలనతో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని వనపర్తిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎంపీపీ కృష్ణ నాయక్, నాయకుడు నాగం తిరుపతి రెడ్డి, ఆయా గ్రామాల తండాల సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.