student : ఆ విద్యార్థి ప్రతిభ అద్భుతం.. వేస్ట్ మెటీరియల్ తో ఎలక్ట్రికల్ పరికరాల ఆవిష్కృతం..
వేసవి సెలవుల్లో అంది వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలోని ప్రతిభకు పదును పెట్టాడు ఓ విద్యార్థి.
దిశ, జడ్చర్ల : వేసవి సెలవుల్లో అంది వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలోని ప్రతిభకు పదును పెట్టాడు ఓ విద్యార్థి. ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించి వేస్ట్ మెటీరియల్ తో తక్కువ ఖర్చుతో ఎలక్ట్రికల్ వస్తువులను తయారు చేసి ఔరా అనిపించాడు. ఈ తొమ్మిదో తరగతి చదువుతున్న కె. జగదీష్ అనే విద్యార్థి జడ్చర్ల పట్టణంలోని స్మార్ట్ వండర్స్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నాడు.
ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విద్యార్థికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించడం, వాటి పనితీరును పరిశీలించడం హాబీగా ఉండేదన్నారు. దీంతో వేసవి సెలవుల్లో వేస్ట్ మెటీరియల్‌ని ఉపయోగించి తనలోని ప్రతిభను పరీక్షించుకోవాలని ఆలోచించి ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాల వేస్ట్ మెటీరియల్ తో హోమ్ థియేటర్, టేబుల్ ఫ్యాన్, మోషన్ అల్లారం, హోమ్ హీటర్, కూలర్, రిమోట్ కారు వంటి వస్తువులు తయారు చేశాడని తెలిపారు. మార్కెట్లో లభించే వాటికన్నా తక్కువ ధరతో మెటీరియల్‌ని తయారు చేశాడని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. చిన్న వయసులోనే ఎలక్ట్రికల్ విభాగంలో తనకున్న మేధాశక్తిని ఉపయోగించి ప్రతిభ కనబర్చిన విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో పాటు పట్టణ ప్రజలు అభినందించారు. విద్యార్థికి ఎలక్ట్రికల్ పై ఉన్న ఆసక్తి మేరకు ఆ దిశగా పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తామని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.