వేడెక్కిన నడిగడ్డ రాజకీయం

నడిగడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయ పాదయాత్రలు జోరుగా సాగుతున్నాయి.

Update: 2023-03-07 02:14 GMT

దిశ ప్రతినిధి, గద్వాల: నడిగడ్డ జోగులాంబ గద్వాల జిల్లా లో రాజకీయ పాదయాత్రలు జోరుగా సాగుతున్నాయి . అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీతో పాటు పలువురు ఇతర ముఖ్య నేతలు సైతం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో జోరుగా పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నేతలు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.. వాటి అమలు.. సాగునీటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాల గురించి యాత్రలు సాగిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేలా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

భారతీయ జనతా పార్టీ నేతలు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల పేరుతో సమావేశం నిర్వహిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 77 శక్తి కేంద్రాలలో 74 కేంద్రాలు, గద్వాల నియోజకవర్గంలోని 95 కేంద్రాలకు గాను 94 కేంద్రాలలో సమావేశాలను పూర్తి చేశారు. గత ఏడాది కాలంగా భారతీయ జనతా పార్టీ నేతలు జిల్లాపై పట్టు సాధించేందుకు సాగిస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పర్యవేక్షణలో హాత్ సే హాత్ జోడోయాత్రలు గత 90 రోజులు కొనసాగే ఈ కార్యక్రమం ఇప్పటికే 16 రోజులపాటు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు.

గత పది రోజుల నుండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోనూ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. విద్య, ఉపాధి, సాగునీటి సౌకర్యాల కల్పనలలో ప్రభుత్వ వైఫల్యాలను గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రత్యేకించి అలంపూర్ నియోజకవర్గ రైతులకు ఆర్డిఎస్ ద్వారా అందవలసిన సాగునీటిని గురించి ప్రజలకు వివరిస్తున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ సారథ్యం లోను పాదయాత్రలు కొనసాగనున్నయి. పత్తి రైతులకు జరుగుతున్న మోసాలు... సాగునీటి విషయంలో జరుగుతున్న మోసాలను గురించి ప్రజల తరఫున పోరాటాలు సాగిస్తున్నారు... 20 రోజులపాటు పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువ అవ్వడానికి ఈ యాత్ర కొనసాగనున్నది. మొత్తం పై అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టి ఈ పాదయాత్రలు కొనసాగుతుండడం... నడిగడ్డ రాజకీయ వేడిమి ఊపందుకుంది

Tags:    

Similar News