సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్..
శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
దిశ, మహబూబ్ నగర్: శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని టీచర్స్ కాలనీలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భగీరథ కాలనీ, ధనలక్ష్మీ కాలనీ, హనుమాన్ కాలనీ, టీటీడీ గుట్ట తిరుమలనాథ దేవాలయం, శివశక్తి నగర్, రాంమందిర్ చౌరస్తా లోని చంద్రగురుస్వామి రాంమందిరం, రామకోటి స్థూపాలయం, కాటన్ మిల్లులో గల వెంకటేశ్వర ఆలయాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు.
కాటన్ మిల్లులోని వెంకటేశ్వరుని దేవాలయంలో రూ. 50 లక్షల నిధులతో మిని కళ్యాణ మండపం నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రం కేసీఆర్ పాలనలో రామ రాజ్యంగా కొనసాగుతుందని, శ్రీరాముని కృపతో పాలమూరు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వ నిధులతో వేయించిన బోరును ఆయన ప్రారంభించారు.
శ్రీరాముని శోభాయాత్రలో..
ఎస్సార్ నగర్ కాలనీ ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మర్లు ప్రధాన రహదారిలో జరిగిన శ్రీరాముని శోభాయాత్రలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.