బీఆర్ఎస్ అంటేనే రైతుల ప్రభుత్వం.. మంత్రి నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ అంటేనే రైతుల మేలుకోరే ప్రభుత్వం అని అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పథకంతో పెట్టబడుల సహాయం అందించడం, రైతు బీమా కల్పించడం వంటి అద్భుతమైన పథకాలు తీసుకువచ్చామని, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, వనపర్తి : బీఆర్ఎస్ అంటేనే రైతుల మేలుకోరే ప్రభుత్వం అని అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పథకంతో పెట్టబడుల సహాయం అందించడం, రైతు బీమా కల్పించడం వంటి అద్భుతమైన పథకాలు తీసుకువచ్చామని, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్ద మందడి మండలంలోని జంగమాయ పల్లి, బలిజపల్లి, పామిరెడ్డి పల్లి, ముందరితండా, చీకురుచెట్టు తండా, వీరాయపల్లి, గట్ల ఖానాపూర్, వెల్టూరు, చిన్నమునగాల్చేడ్, పెద్దమున్గాల్చేడ్, కన్మనూరు, బలీద్ పల్లి, చిల్కటోనిపల్లి గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బాగుంటే ఊరు బాగుపడ్తది.. సమాజంలోని మిగతా వర్గాలు బాగుంటాయని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పల్లెలు బాగుపడ్డాయని ఆయన అన్నారు.
తెలంగాణ గతంలో ఎట్లున్నదో.. ఇప్పుడు ఎట్లున్నదో... ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నదని, గతంలో పంటలు అంటే ఆంధ్రానే అనుకునే వాళ్లం .. తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్లలోనే ఆంధ్రా వారిని వెనక్కి నెట్టి తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పంటచేలు పచ్చగా, కల్లాలు వరి ధాన్యాలతో దర్శనం ఇస్తున్నాయి. గతంలో కరంటు కష్టాలను చవిచూశాం.. గతంలో ఒక్క ట్రాన్స్ ఫార్మర్ కోసం రైతులు తండ్లాడేది అలాంటిది నేడు వందలు, వేల ట్రాన్స్ ఫార్మర్లను రైతులకు అందించామని అన్నారు. ఈ ఏడాది వానలు లేకున్నా 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది.. మనకన్నా పెద్దదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగవుతున్నది ఇక యాసంగిలో ఆంధ్రాలో 14 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. తెలంగాణలో 60 ఎకరాల్లో సాగవుతున్నది దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పంటలతో పోల్చుకుంటే ఆంధ్రాలో సాగవుతున్నది చారాణ వంతే అని అన్నారు.
రేపు జరగబోయే ఎన్నికలు నాలుగున్నర కోట్ల ప్రజల బ్రతుకులు మార్చేఎన్నికలని, కావున ప్రజలు వేలల్లో బ్రతుకుతెరువునిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేసి ఆశీర్వదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వారికి తెలంగాణ ప్రజల కష్టాలు కళ్ళకు కనబడవని, వారు పట్టించుకోరని ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేశారని, మన మన రాష్ట్రం మనకు కావాలని పోరాడి వందల మంది ప్రాణాలు అర్పిస్తే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోలేదని మంత్రి విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ వారు ఇచ్చే నల్ల బొల్లి గ్యారెంటీలను నమ్మవద్దని మరోసారి మా ప్రభుత్వానికి అధికారం అందిస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, రూ.2016 ఆసరా ఫించన్ దశలవారీగా రూ.5000 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని , గ్రామగ్రామాన కమ్యూనిటీ హాళ్లు, సీసీ రహదారులు, డ్రైనేజీలను నిర్మించామని, ఆసుపత్రులు బాగు చేసి ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశామని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధితో అభాగ్యులకు అండగా నిలుస్తున్నామని అన్నారు. బాగుపడ్డ బతుకులను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాను ఈ తొమ్మిదేళ్లు ప్రజల మధ్యనే ఉంటూ వనపర్తి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని ప్రజలు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో తనను మరోసారి గెలిపించాలని కోరారు. పామిరెడ్డి పల్లి గ్రామ శివారులో కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తీసుకుని వచ్చి భోజన సమయంలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నుండి రోడ్డు వైపుకు వస్తున్నా రైతులను చూసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి గజమాల, హరతులు, డప్పులు వ్యాయిదాలతో ప్రజలు ఘనంగాస్వాగతం పలికారు. కాగా పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు, పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు పామిరెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రచారంలో మంత్రి వెంట రైతు బంధు సమన్వయ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, సర్పంచులు జయంతి, సతీష్, సత్యం గౌడ్, కోట్ల వెంకటేష్, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.