Minister Jupally : సామాజిక న్యాయం అందేలా ప్రజాపాలన అందిస్తున్నాం

ప్రజలకు పారదర్శక పాలనతో పాటు,అన్ని వర్గాలకు

Update: 2024-08-15 11:32 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : ప్రజలకు పారదర్శక పాలనతో పాటు,అన్ని వర్గాలకు స్వేచ్ఛ,సామాజిక న్యాయం అందించేలా తమ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్,సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.78 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి,ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ,ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు తమ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుందని,ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద 83.33 లక్షల మంది మహిళలు నిత్యం ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని,దీని ద్వారా ఆర్టీసీకి 40.32 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని,ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించనున్నామని,ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో 10, గ్రామీణ ప్రాంతాలలో 44 ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తున్నాయని మంత్రి వెల్లడించారు.రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం కింద అర్హులైన ఒక లక్ష 9,682 మంది లబ్ధి పొందుతున్నారని,గృహజ్యోతి పథకం కింద 1,19,834 మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని,తద్వారా ప్రభుత్వం 9.02 కోట్ల సబ్సిడీ ఇస్తున్నదని ఆయన తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని 5 నుండి 10 లక్షల రూపాయల పరిమితి పెంచామని,ఇప్పటి వరకు 89,497 మంది శస్త్ర చికిత్సలు చేయించుకుని లబ్ధి పొందారని,ఇందుకుగాను రూ.197.87 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 624 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని,జిల్లాలో చదువుతున్న 71 వేల 689 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.రైతు పంట రుణమాఫీలో భాగంగా మొదటి విడత 42,291 మంది రైతులకు 232 కోట్ల రూపాయలు,రెండవ విడత 22 వేల 148 మంది రైతులకు 218 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినట్లు వెల్లడించారు.

దీంతోపాటు,వ్యవసాయ అనుబంధ రంగాలు,పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,మహిళా సంక్షేమం,క్రీడలు,ఎక్సైజ్,రహదారులు శాఖల ద్వారా పలు పథకాల కింద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతున్నదని వివరించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవం,స్వచ్ఛదనం-పచ్చదనం కింద జిల్లాలోనేక కార్యక్రమాలను చేపట్టడుతూ,జిల్లాను ప్రగతిలో మరింత ముందుకు నడిపించేందుకు ప్రజాప్రతినిధులు,అధికారులు,ప్రజలు అందరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అంతేకాక ఆయా శాఖల అభివృద్ధిని తెలియజేసే విధంగా రూపొందించిన శకటాలు,విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సైతం మంత్రి సందర్శించారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,జిల్లా ఎస్పీ జానకి,అదనపు కలెక్టర్ మోహన్ రావు,మహబూబ్ నగర్,దేవరకద్ర శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి,జి.మధుసూదన్ రెడ్డి,ఇతర ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Similar News