అలంపూర్ ప్రైవేట్ పాఠశాలలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి.. ఆలస్యంగా వెలుగులోకి
అలంపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వ్యక్తి మృతి
దిశ,అలంపూర్ టౌన్: అలంపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమల గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంతో కలిసి అలంపూర్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలొ పనిచేస్తున్నారు. పిల్లలు అదే పాఠశాలలో చదువుకుంటూ ఉండగా భార్య భర్తలు అక్కడే పని చేస్తున్నారు. ఒకటో తేదీ సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో వంటగదిలో ఆంజనేయులు స్పృహ తప్పి పడిపోయాడని భార్యకు సమాచారం ఇచ్చారు.
పాఠశాల యాజమాన్యం వెంటనే ఆంజనేయులును అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగ్గురు ఎస్సైలు సీఐ బందోబస్తు నిర్వహించినట్లు సమాచారం. గ్రైండర్ వేస్తుండగా విద్యుత్ షాక్ తో ఆంజనేయులు మృతి చెందినట్లు మృతుని బంధువులు చర్చించుకుంటున్నారు. మృతుడు ఆంజనేయులు కళ్ళు తిరిగి పడిపోయాడా లేక విద్యుత్ షాక్ తో మరణించాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.