సినీ నటుడిపై కేసు నమోదు

తెలుగు సినీతారలు వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్నారు.

Update: 2024-11-26 10:05 GMT

దిశ, కూకట్ పల్లి : తెలుగు సినీతారలు వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు కేసును కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారంచెడుకు చెందిన ఓ మహిళ (35) మొయినాబాద్ లో నివాసం ఉంటుంది. సినీ నటుడు శ్రీతేజ్ తో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంకు దారి తీసింది. కొంత కాలంగా మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీతేజ్ తనను శారీరకంగా వాడుకోవడంతో పాటు తన వద్ద నుంచి 20 లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఆర్థికంగా వాడుకున్న శ్రీతేజ్ తన కుటుంబాన్ని, పిల్లలను ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

     వేరే మహిళ, 7 సంవత్సర కొడుకుతో ఉంటూ తనను మోసం చేస్తున్నాడని గుర్తించి ఏప్రిల్ 2024లో కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశాడని తెలిపింది. ఆయన భార్యతో విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పేర్కొంది. అంతకు ముందు వివాహం అయిన అర్చన అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీతేజ్ కారణంగా ఆమె భర్త సురేష్ గుండెపోటుతో మృతి చెందాడని, దాంతో మృతుడి కుటుంబ సభ్యులు మధాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని బాధితురాలు వివరించింది. 2014లో ఒక ఈవెంట్లో పరిచయం అయిన శ్రీతేజ్ సోషల్ మీడియా ద్వారా తనకు దగ్గర అయ్యాడని, తన పిల్లలను బాగా చూసుకుంటానని నమ్మించాడని బాధితురాలు పేర్కొంది. శ్రీతేజ్ తనను మోసం చేసినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీతేజ్ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించాడు. అంతే కాకుండా పుష్పా 2, ఎన్టీఆర్, వంగవీటి వంటి ప్రముఖ సినిమాలలో నటించాడు. 


Similar News