వృద్ధురాలి నగదు దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మహిళ
గద్వాలలో ఓ ఇంటి దగ్గర కూర్చున్న వృద్ధురాలి నగదును దొంగిలిస్తూ.. పట్టుబడిన సంఘటన గద్వాలలోని రెవెన్యూ కాలనీలో చోటు చేసుకుంది.
దిశ, గద్వాల క్రైమ్: గద్వాలలో ఓ ఇంటి దగ్గర కూర్చున్న వృద్ధురాలి నగదును దొంగిలిస్తూ.. పట్టుబడిన సంఘటన గద్వాలలోని రెవెన్యూ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జయ లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని మెట్లపై కూర్చొని ఉంది. ఇదే క్రమంలో ఓ మహిళ వృద్ధురాలి సమీపానికి వచ్చి ఆకు సంచిలో పెట్టుకున్న నగదును కాజేసేందుకు మాటలు కొనసాగించింది. అదును చూసి జయ లక్ష్మమ్మ అనే వృద్ధురాలి నడుముకు వున్న సంచిని లాగగా బెల్ట్ తెగడంతో..ఆకు సంచితో మహిళ పారిపోతుండగా వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు ఆ మహిళను ఆపేందుకు ప్రయత్నించారు. సమీపంలోని టీ స్టాల్ చుట్టూ పరుగులు పెట్టించింది.
చివరకు ఓ వ్యక్తి ధైర్యం చేసి.. ఆ మహిళను పట్టుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని విచారించాడు. పట్టపగలు దొంగతనం చేసిన ఆమె మతిస్థిమితం లేని మహిళ అని కానిస్టేబుల్ చెప్పడంతో.. స్థానికులు ఆమె దొంగిలించిన నగదును చూపించారు. దీంతో వృద్ధురాలి నుంచి దొంగలించిన 2,400 ల నగదును బాధితురాలికి ఇప్పించారు. పట్టపగలే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా పోలీసులు ఉదాసీనతతో వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీలో నిఘా పెంచాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.