Minister Jupally Krishna Rao : ఆధ్యాత్మిక క్షేత్రం.. సోమేశ్వరాలయాన్ని పర్యాటక హబ్ తీర్చిదిద్దుతాం..
ఆధ్యాత్మిక క్షేత్రం సోమశిల సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
దిశ, కొల్లాపూర్ : ఆధ్యాత్మిక క్షేత్రం సోమశిల సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల లలిత సోమేశ్వర ఆలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని సంరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు. మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి కాపాడుతాయని, తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ, పట్ణణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపడం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.
కృష్ణమ్మకు మంత్రి జూపల్లి హారతి..
సోమశిల కృష్ణానది తీరాన శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అంతకుముందు సోమేశ్వర స్వామివారిని మంత్రి జూపల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సోమశిల వద్ద పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, చేపట్టాల్సిన పనులు, అంచనాలు, ప్రణాళికల రూపకల్పన పై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 365 రోజులు కృష్ణానది పరివాహాక ప్రాంతం నీళ్లతో నిండుగా ఉండాలని, గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఇవాళ సోమశిలను సందర్శించినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలను టూరిజం హాబ్ లుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పర్యాటక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పర్యాటకులను ఆకర్శించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక వసతుల కల్పన పై పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని అన్నారు.
పాశ్చత్య దేశాల్లో వారాంతాల్లో మానసిన ఆహ్లాదం కోసం పర్యాటక ప్రాంతాలను సందర్శించి సేదతీరుతారని, భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నోప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నప్పటికీ.. పర్యాటకులను ఆకర్శించేందుకు సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. త్వరలోనే నూతన పర్యాటక విధానాన్ని తీసుకువస్తామని అన్నారు. పర్యాటక అభివద్ధి వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ బదావత్, కొల్లాపూర్ ఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహశీల్దార్ విష్ణువర్ధన్ రావు, ఎంపీడీవో మనోహర్, పర్యాటక, పురావాస్తు శాఖ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.