జలదిగ్భందంలో మర్లపాడు తండా..

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఎస్ఎల్బీసీ

Update: 2024-09-02 04:28 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్లపాడు తండా గ్రామానికి డిండి బ్యాక్ వాటర్ ఆదివారం రాత్రి అంతా చుట్టుముట్టింది. గ్రామం ఎటు చూసినా నీటిలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ రిజర్వాయర్ పంపు గ్రామం కనుక ఆ గ్రామంలో ఉన్న భూములను ఆన్లైన్లో లేకుండా రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా పై గ్రామానికి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇతర సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎటుచూసినా ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తూ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ క్రమంలోనే డిండి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఉధృతంగా రావడం వల్ల మర్లపాడు గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అధికారుల సహకారం కోసం ఎదురుచూస్తున్నామని గ్రామస్తులు వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు మా గోస బాధను చూసి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే వేలాది ఎకరాలు పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంకెంతకాలం మాకు ఈ కష్టాలు అధికారులు జర మా బతుకులు చూడండి..కావున ప్రభుత్వ యంత్రాంగం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామ పునర్నిర్మాణానికి...

మర్లపాడు గ్రామం పూర్తిగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రిజర్వాయర్లు ముంపులో ఉందని కావున గ్రామాన్ని పూర్తిగా అనువైన చోట స్థలాన్ని చూపి గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికార యంత్రాంగం తో మాట్లాడి సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే డిండి బ్యాక్ వాటర్ ఉధృతంగా ప్రవహిస్తున్నడంతో దేవరకొండ ప్రాంతానికి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి.


Similar News