వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కృష్ణ నది తీర ప్రాంతాల్లో వరి కోతలు ఇప్పటికే ప్రారంభమైనందున వచ్చేవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ యాసంగిలో దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 2060 మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఐకేపీ ద్వారా 46, పీఏసీఎస్ ద్వారా 56 మరికొన్ని మెప్మా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు తేమ యంత్రాల ద్వారా తేమశాతం కొలిచి టోకెన్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. తూకం చేసే యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని, ధాన్యం సేకరణకు 40 లక్షల గన్ని బ్యాగులు అవసరం కాగా జిల్లాలో ఇప్పటివరకు 20లక్షల గన్ని బ్యాగులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 20 లక్షల గన్ని బ్యాగులు జిల్లాకు రానున్నాయని తెలిపారు. గత సంవత్సరం ధాన్యం తీసుకొని మిల్లింగ్ చేసి ఎఫ్ సీఐకి అప్పగించటంలో నిర్లక్ష్యం చేస్తున్న మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇవ్వడంలో పునరాలోచన చేయాలని సూచించారు.