Mahaboob Nagar: అడుగుదూరంలో అరవై ఏండ్ల కల..!

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.

Update: 2024-12-13 01:51 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్ మూడేండ్లలో పూర్తి చేస్తామని ప్రకటించి పనులకు శ్రీకారం చుట్టిన విషయము పాఠకులకు విధితమే. మొదట్లో ఈ ప్రాజెక్టుకు రూ.32,500 కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది. పలు కారణాలతో ఈ అంచనా రూ.55వేల కోట్లకు చేరింది. ఇప్పటివరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం 90శాతం పనులు పూర్తయ్యాయని ప్రకటించినా వాస్తవంగా 60నుంచి 70శాతం పనులే పూర్తయ్యాయి. ప్రస్తుతం లక్ష్మీదేవి పల్లి వద్ద మరో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అంచనా వ్యయం మరింత పెరిగేలా ఉన్నాయని ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పథకం పూర్తి కావాలంటే రూ.35వేల కోట్ల నుంచి 40వేల కోట్లకు అవసరం కానున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పాలమూరు జిల్లా ప్రాజెక్టుల రివ్యూ సమావేశాలలో ఈ అంశంపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు , ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు హాజరుకాగా, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రస్తుతం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిస్థితులు, పెండింగ్ బిల్లులు, నిర్వాసితులు, రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, తదితర అంశాలపై చర్చలు జరిపారు. పనులు పూర్తిస్థాయిలో జరగాలంటే తప్పనిసరిగా మరో రూ.35వేల నుంచి 40 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాలు తయారు చేశారు.

అసెంబ్లీలో చర్చించే అవకాశం..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయ్యే ఖర్చులు, నిర్వాసితులు, రైతులకు నష్టపరిహారం చెల్లింపులు తదితర అంశాలను గురించి చర్చించిన అనంతరం నిధుల కేటాయింపునకు సంబంధించి సమావేశాలలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News