ఇళ్లకు చేరేందుకు ఇక్కట్లు
మండలంలోని పలు బస్సు స్టేజ్ ల వద్ద నేటికీ విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, ఊట్కూర్ : మండలంలోని పలు బస్సు స్టేజ్ ల వద్ద నేటికీ విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మక్తల్ - నారాయణపేట పనుల కొరకు వెళ్లే ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు మక్తల్, పేట ప్రాంతాలకు నిరంతరం వెళ్తూ ఉంటారు. సాయంత్రం ఇండ్లకు చేరే సమయంలో చీకటి మయంగా మారుతుండడంతో..భయాందోళనకు గురవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. చేతిలో టార్చ్ లైట్ లు ఉండవు.. స్టేజీల దగ్గర నిలిచి ఉందామంటే విష సర్పాలు ఎటు నుంచి వస్తాయో అని ఆందోళనకు గురవుతున్నారు. మరో ప్రక్కన ప్రధాన స్టేజిల దగ్గర ఆగుదామన్నా..రహదారి గుండా వెళ్లే వాహనాలు అధిక స్పీడ్ తో వెళ్తుండడంతో.. అటువైపుగా నిలిచి ఉండాలంటేనే ప్రజలు జంకుతున్నారు. రోడ్డు ప్రక్కనే విద్యుత్ తీగలు ఉన్న ఒక బల్బు లేకపోవడం శోచనీయం అని పలువురు అంటున్నారు. జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి ప్రధాన స్టేజీల దగ్గర విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. స్టేజిల దగ్గర విద్యుత్ బల్బ్ లు నిర్మిస్తే కుటుంబ సభ్యులు వాహనాలు వచ్చేవరకు అక్కడే నిలిచి ఉండొచ్చని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.