కేటీఆర్ దత్తత గ్రామానికి రోడ్డే దిక్కు లేదు...!
హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న... ఖుదాబాక్షపల్లికి సరైన రోడ్డు సౌకర్యం లేదు.
దిశ, మర్రిగూడ: హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న... ఖుదాబాక్షపల్లికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఏళ్లకేళ్లగా ఎదురుచూస్తున్న గిరిజన తండా ప్రజలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని ఖుదాబాక్ష పల్లి గ్రామం నుంచి వయా సాయి బండ తండా , దేవుల తండా నుంచి అంతంపేట వరకు బీటీ రోడ్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు కాంట్రాక్టర్ జంగల్ కటింగ్, మట్టి పనులు ప్రారంభించారు. దీంతో గిరిజన తండాలుతో పాటు సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాలకు నల్గొండ జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం కలగనుంది. ఇక్కడి గిరిజన తండా వాళ్ళు రంగారెడ్డి జిల్లా, మంచాల, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాడానికి బస్ సౌకర్యం కలగనుంది. ఏండ్లకు ఏండ్లుగా రోడ్డు సౌకర్యం కోసం ఎదురుచూసిన గిరిజనులకు ఎట్టకేలకు రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గిరిజనులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కేటీఆర్ దత్తత తీసుకున్న బీటీ రోడ్డు వేయలే....
గత ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రిగా ఉన్న కేటీఆర్ దేవుల తండాను దత్తత తీసుకున్నారు. ఖుదాబాక్ష పల్లి నుంచి అంతంపేట వరకు బీటీ రోడ్డు వేయిస్తానని గ్రామంలో నీటి వసతితో పాటు పాఠశాల నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. మునుగోడు బై ఎలక్షన్‌లో కేటీఆర్‌ను నిలదీస్తూ పోలింగ్ రోజున గిరిజనులు పోలింగ్‌లో పాల్గొనకుండా నిరాకరించడంతో అప్పట్లో దేవుల తండా, అన్నా తండా వార్తల్లోకి ఎక్కింది. మళ్లీ కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి దత్తత తీసుకున్న రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు కాలేదు. అప్పట్లో గిరిజనులు కేటీఆర్‌కు శాపనార్ధాలు సైతం పెట్టినట్టు ప్రముఖ పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి చొరవతో ఏడు కోట్లు మంజూరు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ఖుదాబాక్ష పల్లి నుంచి వయా సాయి బండ తండా మీదుగా అంతంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఏడు కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున ఆ తండా గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.
నేరుగా రాజధానికి, జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం
ఖుదాబాక్ష పల్లి నుంచి అంతంపేట బిటి రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ఈ రోడ్డు నుంచి రాష్ట్ర రాజధానికి, జిల్లా కేంద్రానికి నేరుగా సౌకర్యం ఉంటుంది. సుమారుగా 5 తండాలకు రోడ్డు సౌకర్యం ఉంటుంది. దీంతో మెరుగైన విద్య వైద్య వసతులు సమకూరే అవకాశం ఉంటుంది.