Jurala Dam : జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

Update: 2024-07-17 16:39 GMT

దిశ, గద్వాల : కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ జూరాల వైపు పరుగులు తీస్తోంది. మంగళవారం ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోగా బుధవారం ఉదయం నారాయణపూర్‌ డ్యాం గేట్లు ఎత్తారు. బుధవారం ఉదయం ఆల్మట్టికి 82వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా 65వేల క్యూసెక్కుల నీటిని (అవుట్‌ ఫ్లో)గా విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌ డ్యామ్‌ను వరద నీరు ముంచెత్తుతున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని బుధవారం ఉదయం నారాయణపూర్‌ డ్యామ్‌ 12 గేట్లును ఎత్తి 37,260 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు అంతకుముందు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది.

ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల గేట్ల ద్వారా విడుదలైన వరద నీరు బుధవారం రాత్రికి జూరాలకు చేరుకోవచ్చని జూరాల అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్తుత్పత్తి ప్రారంభించినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలకు గాను 99.317 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలకు గాను ప్రస్తుతం 30.699 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జూరాల జలాశయంలో 9.657 టీఎంసీలు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 7.663 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం..

గద్వాల : జూరాల జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించగా విద్యుత్ ఉత్పత్తికి 7,500 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

Tags:    

Similar News