బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి..

నిజాం కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా సాహితీ పరిమళాలను వెదజల్లిన సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు.

Update: 2023-06-11 13:58 GMT

దిశ, ప్రతినిధి వనపర్తి : నిజాం కాలంలో గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా సాహితీ పరిమళాలను వెదజల్లిన సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించేది కవులు కళాకారులే అని అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కవులకు, కళాకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు. మన కవులు కళాకారులను గుర్తుంచుకొని వారికి సన్మానం చేసుకోడానికి నేడు సాహిత్య దినోత్సవం జరుపుకొంటున్నామని అన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఇతర ప్రణుఖులతో కలిసి 500 మంది కవులతో రచించిన సురవరం తెలంగాణం 3వ. కవితా సంపుటిని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలలో భాగంగా కవి సమ్మేళన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో సాహితీ వేత్తలు, కవులు, రచయితలు తమ సాహిత్యం ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని అందించారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సురవరం ప్రతాపరెడ్డి రాజకీయ, సాంఘిక, సంపాదకుడిగా. పరిశోధకుడిగా. పండితుడిగా, రచయితగా. క్రియాశీల ఉద్యమ కారుడుగా ప్రాథమిక హక్కుల గురించి పోరాడారని, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేశారని మంత్రి అన్నారు.

తెలంగాణలో కవులే లేరు అన్న నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 మంది కవులు రచించిన గోల్కొండ కవుల సంచిక ను ప్రచురించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 1952 లో వనపర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సురవరం తెలుగు భాషకు, సంప్రదాయాలకు. వ్యక్తిత్వానికి, ఉనికిని తన రచనల ద్వారా చాటిచెప్పారని అన్నారు. తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి తెలుగు అధికార భాషగా ఏర్పడటానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి, సి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ సాహితీవేత్తలు, రచయితలు, కవులు భాషకు గుర్తింపు చేస్తూ, అనగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి సాహితీవేత్తలు తమ కవితలతో, రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తారని ఆయన అన్నారు.ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ నుండి అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కూచిపూడి కళాకారులు, బాల భవన్ చిన్నారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, వైద్య కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అంతకు ముందు 55 మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేశారు. ఈ సందర్భంగా కవులకు ప్రశంస పత్రాలను, జ్ఞాపికలను అందజేసి వారిని సన్మానించారు. అంతకు ముందు బతుకమ్మ, డప్పు వాయిద్యాలు, చెక్క భజన, గంగిరెద్దు వంటి వివిధ కళా ప్రదర్శనల ద్వారా మంత్రికి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, డిఈఓ. గోవిందరాజులు, డి.ఐ.ఈ.ఓ. జాకీర్ హుస్సేన్, డాక్టర్ వీరయ్య, బలరాం, సురవరం ప్రతాపరెడ్డి, సి నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కృష్ణమోహన్ రెడ్డి. కృష్ణ వర్ధన్ రెడ్డి, సూరి పేట వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నయ్య, రావులపాటి సీతారాం, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, జిల్లా అధికారులు, వైద్య, వ్యవసాయ కళాశాలల విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News