కళ్యాణ వైభోగమే...
పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, వేద పండితులు, వేలా బంధుమిత్రుల నడుమ నిరుపేద వధూవరులు ఆదివారం ఒక్కటి కానున్నారు.
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ట్రస్టు సహకారంతో ఒక్కటి కానున్న 220 మంది జంటలు
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, వేద పండితులు, వేలా బంధుమిత్రుల నడుమ నిరుపేద వధూవరులు ఆదివారం ఒక్కటి కానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మర్రి జమున దంపతుల ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 మంది జంటలకు ఒకే వేదికపై సామూహిక వివాహాలను జరిపించనున్నారు. ఆదివారం ఉదయం 10.05కు బ్రహ్మ ముహూర్తాన జంటలను ఆశీర్వదించేందుకు వేద పండితులు, వేలమంది బంధుమిత్రులతో పాటు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించినట్లు ఆయన తెలిపారు. స్థానిక జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన నిరుపేద ఆడబిడ్డలకు అన్ని తనై కుటుంబ పెద్దగా భావించి పెళ్లిళ్లు చేసేందుకు ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి ముందుకొచ్చారు. అదేవిధంగా ముస్లిం, క్రైస్తవుల జంటలకు కూడా వారి ఆచారాల ప్రకారమే పెళ్లిళ్లు నిర్వహించననున్నట్లు ఆయన తెలిపారు. మెట్టెలు మాంగల్యంతోపాటు కుటుంబ అవసరాలకు సరిపడా సామాగ్రిని కూడా ఇప్పటికే సమకూరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అనంతరం ఒకే ముహూర్తానికి ఒకటే వేదికగా 220 మంది జంటలను మాంగళ్యంతో ఏకం చేసేందుకు ముత్యాల తలంబ్రాలు, పందిళ్లను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం హాజరై నిరుపేద వధూవరులను నిండు మనసుతో దీవించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జమున దంపతులు పిలుపునిచ్చారు.