ఆ గ్రామాలకు బస్సు రాకపోతే పంతులు రారా..
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఏజెన్సీ ప్రాంతాలైన లోతట్టు గ్రామాల్లోని బడులకు ఉపాధ్యాయులు రావడం లేదని వాపోతున్నారు.
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఏజెన్సీ ప్రాంతాలైన లోతట్టు గ్రామాల్లోని బడులకు ఉపాధ్యాయులు రావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆవేదన చెందుతున్నారు. బస్సులు వస్తేనే పంతులు బడికి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండలంలో చివరి గ్రామాలైన ఆంజనేయ తండా, అక్కారం, బక్క లింగాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడి ఉన్నాయి. మా గ్రామాలకు బస్సు రాకపోతే.. పంతుల్లు రారా.. ఇలా అయితే ఎలా.. పిల్లల చదువు ప్రశ్నార్ధకమే అవుతుందని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి అధికారుల పర్యవేక్షణ లోపమే ఏజెన్సీ గ్రామాలలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యా కమిషన్ చైర్మన్ పర్యటించిన మార్పు లేదు..!
గత వారంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎఎస్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అమ్రాబాద్ మండలాలలో పర్యటించారు. అయినప్పటికీ ఏజెన్సీ గ్రామాలలో ఉపాధ్యాయుల రాక.. దేవుడికి ఎరుక అన్న చందంగా ఉపాధ్యాయుల తీరులో ఏమాత్రం మార్పు చోటు చేసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమయపాలన అసలే లేదు...
ఉపాధ్యాయులు ఏజెన్సీ గ్రామాలలో సమయపాలన పూర్తిగా పాటించడం లేదని నిర్ధారణ అవుతుంది. మంగళవారం మీడియా స్వయంగా ఉదయం 9 గంటల నుండి అచ్చంపేట మండలంలోని ఆంజనేయులు తండా పాఠశాలకు 10:05 తాళం వేసి ఉన్నది. అక్కారం పాఠశాలకు ఉదయం 10:20 గంటలకు విద్యార్థులు ఉన్నారు. కానీ ఉపాధ్యాయులు లేరు.. ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. తదుపరి బక్క లింగాయపల్లి ప్రాథమిక పాఠశాలకు ఉదయం 10:40 తరగతి గదులకు తాళం వేసి ఉండడంతో..విద్యార్థులు పాఠశాల ముందు ఆవరణలో ఆడుకుంటున్నారు. టీచర్ రాలేదని విద్యార్థులను అడగగా..బస్సు రావట్లేదు టీచర్ మూడు రోజుల నుండి రావడం లేదని విద్యార్థులు తెలిపారు. బక్క లింగాయపల్లి పాఠశాలలో గత మూడు రోజుల నుండి విద్యార్థులకు ఉదయం పూట ఇచ్చే స్నాక్స్ రాగి జావా ఇవ్వడం లేదన్నారు.
స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వివరణ..
ఉపాధ్యాయుల సమయపాలన పాటించడం లేదన్న విషయంపై స్కూల్ హెచ్ఎం బాలస్వామిని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ..గత నెల 30న బక్క లింగాయపల్లి ఉపాధ్యాయురాలు సెలవు పెట్టారని, నాకు ఎలాంటి సమాచారం లేదని, మంగళవారం సెలవు పెట్టినట్టుగా ఎలాంటి మెసేజ్ కూడా ఇవ్వలేదన్నారు. పాఠశాలలు తాళం వేసి ఉండడం బాధాకరమని, సమయపాలన విధులకు హాజరు కాని ఉపాధ్యాయులకు తప్పక నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.