పోలియో రహిత సమాజంలో మార్పు వచ్చింది.. కలెక్టర్ ఆదర్శ్ సురభి

గర్భిణీలకు, పిల్లలకు ఏ సమయంలో ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో వాటి సమయానుసారంగా వ్యాక్సిన్ ఇస్తే ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

Update: 2024-12-03 09:46 GMT

దిశ, వనపర్తి టౌన్ : గర్భిణీలకు, పిల్లలకు ఏ సమయంలో ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో వాటి సమయానుసారంగా వ్యాక్సిన్ ఇస్తే ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా గద్వాల, వనపర్తి జిల్లాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సుపర్వైజర్లకు టీకాల ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక వ్యాధిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చుతో వ్యాక్సిన్ తయారు చేస్తారన్నారు. అలాంటి మహత్తరమైన టీకాలు గర్భిణీలకు, పిల్లలకు ఒక నిర్దిష్ట సమయంలో ఇస్తేనే అవి సమర్థవంతంగా పనిచేస్తాయని, లేనిపక్షంలో వృధా అవుతుందన్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వ్యాక్సిన్ నిపుణులను పిలిపించి మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. టీకాల పై పూర్తిస్థాయి శిక్షణ పొంది మండల స్థాయిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. త్వరలోనే జిల్లాలో మిజిల్ రోటా ఎలివేషన్ టీకా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 9 నెలల పిల్లల నుండి 15 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ టీకా ఇస్తారని, దీని కొరకు ముందుగా ప్రతి ఇళ్ళు తిరిగి టీకా అర్హత ఉన్న వారి జాబితా రూపొందించాల్సి ఉంటుందని తెలియజేశారు. పిల్లలకు టీకా ఇప్పించడం అనేది చాలా మహత్తర కార్యక్రమమని, వైద్య సిబ్బంది బాగా పని చేసి వనపర్తి జిల్లాను రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉంచినందుకు అభినందనలు తెలిపారు.

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ పోలియో టీకాను ప్రతి ఇంటికి తిరిగి ఏ ఒక్కరినీ వదల కుండా టీకాను ఇవ్వడం వల్ల నేడు భారత దేశంలో పోలియో కేసు రహిత దేశంగా మారిందని కొనియాడారు. యం.ఆర్.ఎలిమినేషన్ టీకాను సైతం జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం ఉంటుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎ.శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఒ బి. శ్రీనివాస్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి డా. మురారి, డా.అజర్, డా. డేవిడ్, డా. జోష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, పరిమళ, వంశీ, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సుపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News