పంచాయతీ నిధుల గోల్‌మాల్‌.. ‘పీఎఫ్ఎంఎస్’ నిధులు స్వాహా!

ఓ వైపు పంచాయతీల్లో నిధులు లేక ఇక్కట్లు పడుతుంటే.. కొన్ని చోట్ల పంచయతీ సిబ్బంది నిధులు గోల్‌మాల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Update: 2024-10-04 02:08 GMT

దిశ, కల్వకుర్తి: ఓ వైపు పంచాయతీల్లో నిధులు లేక ఇక్కట్లు పడుతుంటే.. కొన్ని చోట్ల పంచయతీ సిబ్బంది నిధులు గోల్‌మాల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కల్వకుర్తి మండలం పరిధిలోని పంచాయతీల్లో మాత్రం సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం మవుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు అందినకాడికి దండుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. చడీచప్పుడు లేకుండా అధికారులే ప్రజల సొమ్మును కాజేస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి.

గ్రామాల అభివృద్ధి కోసం, ఆక్రమణల కట్టడి కోసం పని చేయాల్సిన అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. మండల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయితీల మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ‘పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం’ (పీఎఫ్ఎంఎస్) నిధుల గురుంచి అవగాహన లేకపోవడంతో సెక్రెటరీ, ఆపరేటర్ల చేతివాటంతో భారీ మొత్తంలో స్వాహా చేసినట్లు భోగట్ట. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదును పంచాయతీకి జమ చేయకపోవడం, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి బిల్లులు పొందడం, కాంట్రాక్టు సిబ్బంది జీతాల పేరుతో నగదు కాజేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారుల చేతికే ‘డిజిటల్ కీ’..

గతంలో జీపీ నిధులు డ్రా చేయాలంటే సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఓటీపీ వచ్చేది. ఇప్పుడు కాస్త ఓటీపీలకు అధికారుల మొబైల్ నెంబర్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. అధికారుల చేతివాటానికి ‘డిజిటల్ కీ’ ఆజ్యం పోసినట్లైంది. శానిటేషన్, వాటర్ వర్క్స్ పేరు మీద అడ్డగోలుగా నిధులు డ్రా చేసి రూ.లక్షలు దండుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క ఓటీపీతో పీఎఫ్ఎంఎస్ నిధులను రూ.లక్షల్లో డ్రా చేయొచ్చు. ఈ లాజిక్‌తో సెక్రెటరీ, ఆపరేటర్లు ఇద్దరు మొబైళ్లకు ఓటీపీ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని ఈ నిధులకు నకిలీ బిల్లులు పెట్టి అప్పనంగా మింగేస్తున్నారు.

సెక్రెటరీ, ఆపరేటర్ల సంబంధీకుల పేరు మీద కూడా నకిలీ బిల్లులు సమర్పించి నిధులను కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అడ్డమైన ఖర్చుల పేరుతో నకిలీ బిల్లులు రూపొందించి నగదును పలు రూపాల్లో పంచాయతీ సొమ్మును దిగమింగుతున్నారు. గ్రామాభివృద్ది నిధుల కోసం ఏర్పాటు చేసిన బుక్స్, ఎంబీ రికార్డులు, మస్టర్లు, ఓచర్లు, చలన్లలో సైతం అవకతవకలు జరుగుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. హోటల్ నడిపే వ్యక్తులపై శానిటేషన్ పేరు మీద రూ.లక్ష డ్రా చేసినట్లుగా సమాచారం. వాస్తవానికి శానిటేషన్ పనులను పంచాయతీ సిబ్బంది చేయించి, బయట వ్యక్తులతో చేయించినట్లు బిల్లులు సమర్పించి రూ.లక్షలను కొంతమంది అధికారులు మింగేశారు.

గత సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు తెలికుండా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు స్వాహా అవుతున్నాయి. జనరల్ ఫండ్ ద్వారా ఇంటి పన్ను, లైసెన్సు, వ్యాపార లైసెన్సు విషయంలో జాప్యం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తు్న్నారు. ఓ ట్రేడ్ లైసెన్స్‌తో పలుమార్లు నకిలీ లైసెన్సు‌లు తయారు చేసి నెంబర్ మార్చి దాని రుసుమును దండుకుంటున్నారు. కొంతమంది అధికారులు 14, 15వ ఫైనాన్స్, ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ సౌకర్యం కాగా, వాటర్ లీకేజీ, పైపులు డ్యామేజ్ మెయింటనెన్స్ అంటూ అవసరం లేకున్నా కొంతమంది గ్రామాధికారులు వాటిపై ఖర్చులు చూపించి నకిలీ బిల్లులు తెచ్చి డబ్బులు వెనుకేసుకుంటున్నారు. ఇప్పటికైనా కల్వకుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోల్‌మాల్‌కు గురైన డబ్బులను రికవరీ చేయాలని కోరుతున్నారు. అప్పనంగా వెనకేసుకున్నా.. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Similar News