వారిని విమర్శించే హక్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదు.. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-07 14:30 GMT

దిశ, దేవరకద్ర : లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్లో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డితో కలిసి జీఎంఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రెండు పర్యాయాలు 61 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు బుద్ధి లేదా అంటూ నిరంజన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అని గత కేసీఆర్ కేబినెట్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను తీసుకొని ఏకంగా మంత్రులను చేసిన దౌర్భాగ్య చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ లో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాక్కొని సీఎల్పీని విలీనం చేసుకొని బట్టి విక్రమార్కని ప్రతిపక్ష నేతహోదా నుంచి దించేసింది కేసీఆర్ కాదా అని మండిపడ్డారు.

ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన నచ్చి వస్తున్నారు తప్ప తాము ఎవరిని బతిమిలాడి బలవంతంగా తెచ్చుకోవడం లేదన్నారు. గతంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి 61 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకొని ప్రజాస్వామ్యానికి త్రిలోదకాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టుగా పెట్టి ఓట్లను గంపగుత్తగా బీజేపీకి వేయించిన నిరంజన్ రెడ్డి విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, మరోసారి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని స్థాయిని మర్చి విమర్శిస్తే ఖబర్దార్ నిరంజన్ రెడ్డి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


Similar News