కాలకూట విషానికి రెట్టింపు ధర.!

నాగర్ కర్నూల్ జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం జోరందుకుంది.

Update: 2024-03-14 16:03 GMT

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం జోరందుకుంది. గల్లి గల్లికి వేసవి షర్బత్ సెంటర్ల మాదిరి దుకాణాలు నూతనంగా వెలుస్తున్నాయి. సహజ సిద్ధంగా ఈత, తాటి చెట్టు నుంచి వచ్చే కల్లును మాత్రమే ప్రజలకు అందించాల్సి ఉంది. కానీ గౌరవంగా బ్రతికే అదే వర్గం నుంచి కొంతమంది వ్యక్తులు అక్రమంగా డబ్బు సంపాదనకు అలవాటు పడి ప్రమాదకరమైన ఆల్ఫా జోలం, డైజోఫాం వంటి మత్తు పదార్థాలు, ఇతర రసాయనాలతో కాలకూట విషం లాంటి కృత్రిమంగా కల్తీ కల్లు తయారు చేసి సామాన్య దినసరి కూలీలకు అంటగడుతున్నారు. ఫలితంగా నిత్యం తాగుడుకు అలవాటు పడిన వారు ఒక్కరోజు లేకున్నా నిద్రలేమి, పిచ్చి ప్రవర్తనతో మానసికంగా కృంగిపోతున్నారు.

మరి కొంతమంది దినసరి కూలీలు కష్టం చేస్తూ అలసిపోయి వేసవి నేపథ్యంలో ప్రతి రోజు పరిమితికి మించి కృత్రిమ కల్తీ కల్లు సేవిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా యువత కూడా కల్తీకల్లుకు బానిసలుగా మారారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించాలన్న ఉద్దేశంతో మొదట్లో కల్తీ కల్లును నిరోధించాలని కొంత ప్రయత్నించింది. కానీ ప్రణాళిక అబద్ధంగా ఆచరించకపోవడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కల్తీ కల్లు దుకాణాలను మూసేశారు.

దీంతో నిద్ర కూడా రాక ప్రజలంతా పిచ్చిగా ప్రవర్తించడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకొని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ బడా నేత తెరవెనుక చక్రం తిప్పి కల్తీకల్లు దందాను రెట్టింపు చేసి లబ్ధి పొందారు. తాజాగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కాదనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నప్పటికీ ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపి కల్తీ కల్లును క్రమక్రమంగా నిలువరించకపోవడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో కల్లుమాముల నడుపుకుంటూ సామాన్య జనం పై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.



తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కల్తీకల్లు ధర పది నుంచి 20కి రెట్టింపు చేసి అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలని కక్కుర్తి పడ్డారు. చివరికి తక్కువ ధరకు అమ్ముతున్న ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసిన కల్లుప్రియలపై కల్లు మాముల నిర్వహించే ముఠా పిచ్చెక్కి ప్రవర్తిస్తూ సామాన్య జనం పై దాడులకు తెగబడ్డారు. కొనుగోలు చేయకపోతే తమ వ్యాపారం దెబ్బతింటుందని 125 మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయంటూ సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఇదే విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టుపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. పైపెచ్చు చేసేది ఘనకార్యం లాగా నిత్యావసర ధరలు పెరగలేదా అందుకే కళ్ళు ధర పెంచాం పది రూపాయలు ఎక్కువ పెట్టి కొనలేరా అంటూ చిర్రుబుర్రు లాడుతున్నారు.

నా పైనే వార్త రాస్తావా..!

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 125 మంది కులస్తులం ఇదే దందా పైన బ్రతుకుతున్నాం. నిత్యావసర ధరలు పెరగలేదా అందుకే కళ్ళు ధర కూడా పెంచాం. నాగనూల్, ఎండబెట్టి, ఉయ్యాలవాడ వంటి గ్రామాలలోనే కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. ఆ కళ్ళు తాగి చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ జిల్లా కేంద్రానికి చెందిన బాలగౌడ్ అనే వ్యక్తి వేదాలు వల్లించారు. ఒక ప్రాంతం వ్యక్తులు మరో ప్రాంతంలో కల్లు ఎలా కొంటారో నేను చూస్తా. నా పైనే వార్త రాస్తావా అంటూ జర్నలిస్టులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం విశేషం.

కల్తీ కల్లును విక్రయిస్తే చర్యలు తప్పవు.

ప్రమాదకర మత్తు పదార్థాలు రసాయనాలతో కూడిన కల్తీ కల్లును విక్రయిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ధరల విషయంలో గొడవ జరుగుతున్న మాట వాస్తవం అలా ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచితే ఊరుకునేది లేదు.




 


Similar News