అర్హులైన భార్యాభర్తలకు పింఛన్లు ఇస్తాం: డీకే అరుణ
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన భార్యాభర్తలు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామని... DK Aruna hits out at CM KCR
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన భార్యాభర్తలు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కార్నర్ సమావేశాలలో భాగంగా శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని అప్పన్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మాయమాటలు చెప్పి... అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఒరగబెట్టింది ఏమీ లేదు అన్నారు. విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి అని ఆమె ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు యూనివర్సిటీతోపాటు... ఏ ఒక్క యూనివర్సిటీలోనూ అడుగు పెట్టలేదు అని గుర్తు చేశారు. యూనివర్సిటీలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.. వాటిని పరిష్కరించడం చేతకాక... ప్రశ్నించే విద్యార్థులకు సమాధానాలు చెప్పలేకనే ముఖ్యమంత్రి యూనివర్సిటీలలో అడుగుపెట్టడం లేదన్నారు.
రాష్ట్రంలో మంత్రులు గానీ... ఎమ్మెల్యేలు గానీ పోలీసుల సెక్యూరిటీ లేకుండా పర్యటనలు చేయగల సత్తా ఈ నాయకులకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కట్టడం చేతకాక కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీటిని అందించి తీరుతామన్నారు. అర్హులైన భార్యాభర్తలకు పింఛన్లు ఇస్తామని డీకే అరుణ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు గుర్తించాలని... వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని అరుణ పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, జిల్లా నాయకుడు ఎన్ పి వెంకటేష్, కౌన్సిలర్ రామాంజనేయులు తదితరులు ఉన్నారు.