డీజేలకు అనుమతి లేదు: SP Apoorva Rao
దిశ, వనపర్తి: గణేష్ ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు మండప ఏర్పాటుకు...DJ systems will not be allowed
దిశ, వనపర్తి: గణేష్ ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు మండప ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ప్రకటన ముఖంగా గణేష్ ఉత్సవ కమిటీలకు, మండప నిర్వహకులకు సూచనలు చేశారు. వనపర్తి జిల్లా పరిధిలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలకు, మండప నిర్వాహకులు గణేష్ మండపాల ఏర్పాటుకు https://policeportal.tspolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతికి దరఖాస్తు చేసే సమయంలో మండపం స్థలం, ఎన్ని రోజులు నిర్వహించునున్నారు, నిమజ్జనం చేసే తేదీ, నిమజ్జనానికి వెళ్లే ప్రదేశాన్ని, ఏ మార్గం గుండా వెళ్ళేది తదితర వివరాలను మండప నిర్వాహకులు సంబంధిత పోలీస్ స్టేషన్ కు తెలియపర్చాలన్నారు.
ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్న స్థలాలలోనే మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా యువత భక్తిభావంతో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించాలన్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గణేష్ ఉత్సవాలలో, నిమజ్జన ఊరేగింపులో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని ఎస్పీ అపూర్వ రావు స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు పోలీసు శాఖ సలహాలు, సూచనలు పాటించి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు.