పరీక్ష కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల,మహత్మా గాంధీ రోడ్,క్రీస్తు జ్యోతి విద్యాలయం,భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ విధానం,విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించడంతో పాటు,పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిభిరం,మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా,ఫ్యాన్లు,తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు ఏదైనా అస్వస్థతకు గురైతే,వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్,అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు,సెల్‌ఫోన్లను అనుమతించరాదని అన్నారు.
ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి తొలి రోజు పరీక్షలకు మొత్తం 12785 మంది విద్యార్థులు నమోదు కాగా.. వీరిలో 12744 మంది హాజరై,99.68 హాజరు శాతం నమోదయ్యిందని,41 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. భూత్ఫూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,తదితర అధికారులు ఉన్నారు.