శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్

శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని

Update: 2024-10-21 07:48 GMT

దిశ, నారాయణపేట క్రైమ్: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపానికి కలెక్టర్, ఎస్పీ పూల గుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించి సెల్యూట్ చేశారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీలు మాట్లాడుతూ... శాంతి భద్రతలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.

శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు. అమరులైన పోలీసులకు, వారి కుటుంబాలకు ఎలాంటి అవసరాలు ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించడం జరిగింది అప్పటి నుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినముగా ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి చెప్పారు.

ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల్లో 214 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. నారాయణపేట జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో కానిస్టేబుల్ రాజారెడ్డి 2005 సంవత్సరంలో వీర మరణం పొందారని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల, అదనపు ఎస్పీ MD రియాజ్, డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, రామ్ లాల్, చంద్ర శేఖర్, దస్రు నాయక్, RI నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Similar News