fight for property : అనాథల తల్లి శవం ఆస్తి కోసం కుమార్తెల కొట్లాట…

మానవత్వం మంట కలిసిపోతుంది. బంధాలు ,బంధుత్వాలు ఆప్యాయతలు, అనురాగాలకు నేటి సమాజంలో చోటు లేకుండా పోతున్నాయి.

Update: 2024-07-25 13:44 GMT

దిశ, కోదాడ : మానవత్వం మంట కలిసిపోతుంది. బంధాలు ,బంధుత్వాలు ఆప్యాయతలు, అనురాగాలకు నేటి సమాజంలో చోటు లేకుండా పోతున్నాయి. అంతా డబ్బు.. మనిషి బతుకును అక్షరాల డబ్బే శాసిస్తుంది. డబ్బు ప్రాధాన్యతను తెలిపేలా కోదాడ పట్టణంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి శవమై కండ్ల ముందే ఉన్న కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలు తమకు రావలసిన ఆస్తి కోసం తగువపడటం పలువురుని ఆశ్చర్యాన్ని కలిగించింది. వివరాల్లోకెళితే పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో నివాసముంటున్న వెల్దినేని నాగమణి (85) బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాలం చేసింది.

నవ మాసాలు మోసిన తల్లిని కాటికి సాగనంపాల్సిన కూతుర్లే తమకు వాటాలు తేల్చాలంటూ గొడవకు దిగారు. ముగ్గురు కూతుర్లు మధ్య ఉన్న గొడవతో శవం రోడ్డుపైనే ఉంది. ముగ్గురికి తనకున్న ఆస్తిని మూడు వాటాలుగా చేసినప్పటికీ తనకున్న నాలుగో వాటాకు సంబంధించి కూతుర్లు గొడవ పడుతున్నట్లు సమాచారం. ఆస్తి కోసం కన్న తల్లిని అలా రోడ్డుపై ఉంచడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తల్లి చనిపోకముందు 20 రోజుల నుంచి ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ తల్లి రోడ్డుపైనే ఉండి, రోడ్డుపైనే తింటూ తనువు చాలించింది. చివరకు పెద్ద మనుషులు జోక్యం చేసుకొని ఎట్టకేలకు ముగ్గురు కూతుళ్లకు, అల్లుళ్లకు సర్ది చెప్పడంతో గురువారం సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.


Similar News