అసైన్డ్ భూముల అడ్డగోలు అమ్మకాలు.. ఆందోళన బాటలో కొనుగోలుదారులు
ప్రభుత్వ భూములను అమ్మడం.. కొనడం నిషేధం.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ భూములను అమ్మడం.. కొనడం నిషేధం. అమ్మకాలు.. కొనుగోలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చట్టాలు చెబుతున్నా.. ఆ చట్టాలలో ఉన్న లొసుగులను కొంతమంది వ్యక్తులు సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటూ.. ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఊర్కొండ మండల పరిధిలోని ఊరుకోండపేట గ్రామ శివారులో గల 233 సర్వే నెంబర్ లో సుమారుగా 1.06 ఎకరా భూమి జీవనోపాధికి ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ నిరుపేదలుగా గుర్తించి అప్పటి ప్రభుత్వం వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించాలని ఇవ్వడం జరిగింది.
కానీ సదరు పట్టాదారు ఎలాంటి అనుమతులు లేకుండా గృహ నిర్మాణం చేస్తూ వినియోగదారులకు అగ్రిమెంట్, నోటరీ బాండ్ల రూపంలో అమ్మకాలు జరుపుతున్నట్టు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొనుగోలు చేసిన వ్యక్తులు కొలతలు నిర్వహించి హద్దులుగా రాళ్లను పాతుకున్నారు. సదరు భూమికి అనుకోని ఉన్న బీసీ హాస్టల్ బాలుర వసతి గృహానికి వెళ్లే దారి సైతం కబ్జాకు గురైనట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అదే భూమిలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, సరఫరాకు సంబంధించిన పైప్ లైన్లు సైతం ఇదే భూమిలో ఉన్నాయి. కానీ సదరు పట్టాదారు అగ్రిమెంట్ చేసి అమ్ముతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బాండ్ల రూపంలో, నోటరీ రూపంలో వినియోగదారులకు అమ్మకాలు చేస్తూ కాసులు దండుకుంటున్నారు. ప్లాట్లుగా చేసి డబ్బు దండుకుంటున్న అదే భూమిపై పట్టదారుకు రైతుబంధు రావడం విశేషం ఇంత జరిగిన వివిధ శాఖల అధికారులు చోద్యం చూస్తూ ఉండడం గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అనుమతులు లేని క్రయవిక్రయాల విషయంలో అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు ఆరోపిస్తున్నారు. బాండ్ల రూపంలో కొనుగోలు చేసిన పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.