రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ, వీపనగండ్ల : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పానుగల్ మండల కేంద్రంలోని రైతువేదికలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సింగిల్ విండో మహాజన సభ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్టు తెలిపారు. కొంతమంది రైతులకు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదని, త్వరలోనే పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, తనకు పదవి రావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లికి, జిల్లా ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యాటక శాఖ, తెలంగాణ దర్శిని ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను మంత్రి జూపల్లి విద్యార్థులకు పంపిణీ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు ఉండాలని, విద్యార్థులకు డిక్షనరీలు, వార్తా పత్రికలు అందించాలని కోరారు.
పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని,చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవింద రాజులు, తహసీల్దార్ సుభాష్ నాయుడు, ఎంపీడీఓ గోవింద రావు, ఎంఈఓ శ్రీనివాసులు, సింగిల్ విండో వైస్ చైర్మన్లు బాలయ్య, భాస్కర్ యాదవ్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ సాగర్, రాము యాదవ్, పుల్లా రావు, సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.