ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లు, పీఓ పోలీస్, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పీఓలు మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రధానమైందని పేర్కొన్నారు. ప్రతి పీఓ కి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎన్నికల రోజు ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని ఆదేశించారు. జిల్లాలో 5పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మొత్తం ఓటర్లు 664 మంది ఉన్నారని, మార్చి 13వ తేది రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిస్తోందన్నారు. మార్చి 12 న జిల్లా కేంద్రం లోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల కేంద్రాలలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్, ఆర్డీవో రామచందర్, డీఎస్పీ కే. సత్యనారాయణ, జిల్లా ఆధికారులు కృష్ణమ్మ చారి, లియాఖాత్ అలీ, జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.