మొలచింతలపల్లి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్..

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొలచింతలపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, బుధవారం బాధిత మహిళ ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

Update: 2024-07-03 12:35 GMT

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మొలచింతలపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, బుధవారం బాధిత మహిళ ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆమె ఇంటికి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలను పిల్లల చదివు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి కావాల్సిన అవసరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూమి సాగుచేసేలా నీటి అవసరాలను తీర్చేలా చూడాలని సూచించారు.

అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల, కాంపౌండ్ వాల్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు పెండింగ్ లేకుండా వెంటనే పూర్తి చేయించుకోవాలని హెడ్మాస్టర్ కు సూచించారు. పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ 9వ తరగతిలో వచ్చిన మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సబ్జెక్టుల వారిగా క్లాసులు జరుగుతున్నాయని అడిగారు. మంచిగా చదివి ఉన్నతంగా రాణించాలని సూచించారు. పాఠశాలలో హాజరు శాతాన్ని విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మధ్యాహ్నం భోజన కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన రుచికరంగా మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలని, వారంలో మూడు గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.

మొలచింతలపల్లి గ్రామంలోని భ్రమరాంబ కాలనీని కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు. అనంతరం నివాసం ఉంటున్న చెంచు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డు లేని చెంచులకు కొత్త ఆధార్ కార్డు అందించేందుకు గ్రామంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. చెంచులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ కార్డును పొందాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే అందజేస్తామని తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను చెంచులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. చెంచు సమస్యల పై పూర్తి అవగాహన ఉందని అవసరాలను తీర్చేందుకే నేడు సందర్శించారని కలెక్టర్ తెలిపారు. పోడు భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి న్యాయం చేస్తానని, కొత్తగా అడివిలో చెట్లు నరికి సాగు చేసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. అడవులు మన సంపదని.. అడవులను రక్షించుకోవడం మన ప్రథమ కర్తవ్యం అని అన్నారు. చెంచు సమస్యలన్నీ పరిష్కరిస్తామని మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజు, సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, కొల్లాపూర్ తహశీల్దార్ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News