ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
మండల పరిధి జాజాల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దిశ, వంగూర్: మండల పరిధి జాజాల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, చదువు అత్యంత ప్రాధాన్యమైనవని అన్నారు. అదేవిధంగా పాఠశాల వసతులు, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు. పాఠశాలలో వసతులు, విద్యార్థుల ఆహార మెనూ, వంట గదిని పరిశీలించారు. రోజువారి మెనూ ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి భోజన నాణ్యతపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి, అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఏదేని లోపం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండల స్థాయి అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.