విద్యా రంగం బలోపేతానికి సీఎం కృషి : మల్లు రవి

ప్రభుత్వ పాఠశాలలోనే ఉజ్వల భవిష్యత్తు అని విద్యార్థులకు

Update: 2024-06-12 14:02 GMT

దిశ, వంగూర్: ప్రభుత్వ పాఠశాలలోనే ఉజ్వల భవిష్యత్తు అని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్ లో ఉన్నంతగా రాణించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకాంక్షించారు. బుధవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల పున ప్రారంభం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి తో కలిసి హాజరయ్యారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కలెక్టర్, ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడమే కాకుండా, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. కాబట్టి అందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప గా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులతో నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది, కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పారు. అదేవిధంగా చదువుతోపాటు విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పర్యావరణ సమతుల్యతలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత రంగాలలో రాణించిన వారు చాలామంది ఉన్నారని తెలిపారు.

 విద్యా రంగం బలోపేతానికి సీఎం కృషి : పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి తెలిపారు. బడిబాట లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాల, ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని, ఎల్లవేళలా సహకారం ఉంటుందని అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, రెండు జతల బట్టలు ఇవ్వడంతో సన్న బియ్యం తో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కెవిఎన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేమారెడ్డి, డిఇఓ గోవిందరాజులు, పీడీ, డీఆర్డిఏ చిన్న ఓబులేసు, డిపిఓ కృష్ణ, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News