ఖాతాదారుల రూ. 1.49 కోట్లు మాయం చేసిన బ్యాంకు ఉద్యోగి అరెస్ట్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్బీఐ బ్రాంచ్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్న భూమిరెడ్డి కిరణ్ కుమార్ ఖాతాదారుల ఖాతాలో 1.49 కోట్లు మాయం చేసిన విషయంపై దిశలో కథనం వచ్చిన విషయం తెలిసిందే.
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్బీఐ బ్రాంచ్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్న భూమిరెడ్డి కిరణ్ కుమార్ ఖాతాదారుల ఖాతాలో 1.49 కోట్లు మాయం చేసిన విషయంపై దిశలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. అయితే బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఆ మోసగాడి పై కేసు నమోదు చేసి అచ్చంపేట సివిల్ కోర్టు లో మంగళవారం హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని అచ్చంపేట సీఐ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు స్వస్థలం కడప జిల్లా ప్రస్తుతం తాను అచ్చంపేట లో ఎస్బీఐ బ్యాంకు లో 2018 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు విధులు నిర్వహించాడు.
ఈ క్రమంలో ఎస్బీఐ ఏసీబీ బ్రాంచ్ లో అకౌంట్లు కలిగి ఉన్న అమాయకపు ఖాతాదారుల సేవింగ్ అకౌంట్ లో నుండి వారికి తెలియకుండా మోసపూరితంగా రూ. 1 కోటి 49 లక్షల 50 వేలు విత్ డ్రా చేసుకున్నాడు. డబ్బులు తన భార్య సోమాల ప్రశాంతికి, అదే బ్రాంచ్ లో ఉన్న వివిధ అకౌంట్లోకి బదిలీ చేసి తన స్వప్రయోజనాలకు వాడుకున్నారన్నారు. ఖాతాదారులను, బ్యాంకును మోసగించి నమ్మక ద్రోహం చేసిన కిరణ్ కుమార్ అనే ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి పై బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని, పై వ్యక్తిని కోర్టులో హాజరు పరుచగా అచ్చంపేట న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించగా జైలుకు తరలించామన్నారు.