పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల రికార్డు..
పాలమూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవాలు చేయడంలో మరోసారి రికార్డు సృష్టించారు.
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవాలు చేయడంలో మరోసారి రికార్డు సృష్టించారు. ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లో 41 కాన్పులు విజయవంతంగా చేశారు. మొత్తం 41 కాన్పుల్లో 11 సాధారణ ప్రసవాలు జరుగగా, 30 మందికి అత్యంత సమస్యాత్మక హైరిస్క్ తో చేసిన శస్త్రచికిత్స కేసులేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. మొత్తం 41 మంది గర్భిణీలకు పుట్టిన 42 మంది శిశువుల్లో 16 మంది మగ, 26 మంది ఆడ శిశువులు ఉన్నారని, ఒక్కరికి మాత్రమే కవలలు పుట్టారని డాక్టర్లు తెలిపారు. కాన్పులైన మహిళలకు, జన్మించిన శిశువుల ఆరోగ్య పరిస్థితి ని రెండు రోజులుగా గమనించామని అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే మంగళవారం మీడియాకు వెల్లడించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ 'దిశ ప్రతినిధి' కి తెలిపారు. ఈ ప్రసవాలను ప్రసూతి విభాగాధిపతి డా.సంగీత, డా.లక్ష్మీ పద్మ ప్రియ, డా.ఆశాజ్యోతి, డా.స్పూర్తీ, డా.సరిత, డా.అర్చన, డా.సోఫియా, డా.రూహీ, డా.షహనాజ్, డా.సురేఖ లు విజయవంతంగా నిర్వహించినందుకు వారికి పలువురు అభినందనలు తెలిపారు.