గ్రంథాలయ చైర్మన్ ఎవరికి వరించేనో...!
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎట్టకేలకు ఖరారు కావడంతో ఇక జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందో అనే ఉత్కంఠత నారాయణపేట జిల్లాల్లో నెలకొంది
దిశ, నారాయణపేట ప్రతినిధి: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎట్టకేలకు ఖరారు కావడంతో ఇక జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందో అనే ఉత్కంఠత నారాయణపేట జిల్లాల్లో నెలకొంది. ముఖ్యంగా జిల్లాలో ఈ హోదాను దక్కించుకునేందుకు ముగ్గురు ఆశావాహుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మంచి ప్రోటోకాల్... అధికారిక వాహనం...మంచి గౌరవ వేతనం ఉండడంతో ఆశావాహులు ఎలాగైనా ఈ హోదాను దక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
బలంగా వినిపిస్తున్న ముగ్గురు పేర్లు ఇవే...
జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి రేసులో జిల్లా నుంచి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి అయితే మరొకరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, అలాగే మక్తల్ నియోజకవర్గం సంగంబండ చెందిన గవినోళ్ళ గోపాల్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో కోట్ల రవీందర్ రెడ్డి కి మార్కెట్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వగా చివరిలో చేదు అనుభవం ఎదురైంది. ఇక కుంభం శివకుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న బండి వేణుగోపాల్ కే గ్రంథాలయ చైర్మన్ ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే ఈయన పేరును అధిష్టానానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిట శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకపోతే ఆయన గెలుపు కోసం ఎన్నికల్లో పని చేసిన గవినోల్ల గోపాల్ రెడ్డికి గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.