కల్వకుర్తి బంకుల్లో... పెట్రోల్ బదులు నీళ్లు
పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ బదులుగా నీళ్ళు వస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు రావడం తో కల్వకుర్తి లో కలకలం రేపింది.
దిశ, కల్వకుర్తి : పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ బదులుగా నీళ్ళు వస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు రావడం తో కల్వకుర్తి లో కలకలం రేపింది. ఏంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు యాజమానులు. పెట్రోల్ కొట్టించుకుని కొంత దూరం వెళ్లాక దారి మధ్యలో బైక్ లు, కార్లు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్ కొట్టించుకొని మరమ్మతుల కోసం వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్తే....అందులో పెట్రోల్ బదులు నీళ్లు ఉన్నాయని వాపోతున్నారు. ఇది నిజమండోయ్ ..ఇలాంటి సంఘటనలు కల్వకుర్తి పట్టణంలో తరచుగా జరుగుతున్నాయి. మొన్న రఘుపతిపేట, నిన్న మహబూబ్ నగర్ రోడ్డులోని బీఎడ్ కళాశాల పక్కన బంక్, తాజాగా కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గేట్ సమీపంలో బంక్ లో చోటుచేసుకుంది.
వాహనదారులు వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోసుకుని కొంత దూరం వెళ్ళగానే మోరయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగి సాయంత్రం ఇంటికి వెళ్తూ జెపి నగర్ దాటాక జయో పెట్రోల్ బంక్ లో రెండు వందల పెట్రోల్ పోసుకొని బయలుదేరాడు. హమ్మయ్య ఇక భయం లేదు ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చని భావించాడు. కట్ చేస్తే.. పెట్రోల్ బంక్ దాటి కొంచెం దూరం వెళ్ళగానే బండి ఆగిపోయింది. అస్సలు స్టార్ట్ కావడం లేదు. అదేంటి.. ఇప్పుడేగా పెట్రోల్ కొట్టించాం, మరి ఎందుకు ఆగిపోయిందబ్బా అని డౌట్ వచ్చింది. సరేలే అంటూ తోసుకుంటూ ఇంటికెళ్ళాడు. మరుసటి ఉదయం పలుమార్లు బైక్ ను స్టార్ట్ చేయగా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాక మళ్లీ మోరాయించింది. ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆ ఉద్యోగి వాహనాన్ని తోసుకుంటూ మెకానిక్ షాపుకు పరుగులు తీశాడు.
అక్కడ అసలు విషయం తెలిసి వాహనదారుడు కంగుతిన్నాడు. తను కొట్టించుకున్నది పెట్రోల్ కాదు నీళ్లు అని తెలిసి లబోదిబోమన్నాడు. పెట్రోల్‌లో నీరు కలిసిందని బాటిల్ లో మెకానిక్ తీసి చూపించడంతో చుట్టుపక్కల వాహనదారులు సైతం షాకయ్యారు. కొందరు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ పోయించుకున్నవారు మా సంగతి ఏంటని లబోదిబోమంటున్నారు. కల్వకుర్తిలోని పలు బంకుల్లో వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం ఇదే జరగడంతో వాహనాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గరికి వాహనాలను తీసుకువచ్చి వారి వాహనాలలో నుంచి పెట్రోల్ తీయించి మరి యాజమాన్యానికి చూపించారు. కొంతమంది వాహనాల రిపేర్ కు అయ్యే ఖర్చు ను యాజమాన్యం భరించి చేతులు దులుపుకుంటున్నారు. ఇంకొందరు వాహనదారులపై విరుచుకుపడుతున్నారు.
వాహనదారులు ఇక చేసేది ఏమీ లేక నోరు మెదపడం లేదు. గత 15 రోజుల క్రితం రఘుపతి పేట పెట్రోల్ బంక్, వారం క్రితం మహబూబ్ నగర్ రోడ్డులో గల బంక్ లో ఇదే తతంగం జరగడంతో తూ. తూ మంత్రంగా అధికారులు మరుసటి రోజు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారే తప్పా నేటి వరకు చర్యలు శూన్యమని వాహనదారులు, పట్టణ ప్రజలు వాపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు పెట్రోల్ లో కలుస్తున్నా నీళ్ళు వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ లో ఇథనాల్ మిళితమై ఉంటుంది కాబట్టి ఒక్క చుక్క నీరు కలిసిన పెట్రోల్ మొత్తం నీరుగా మారే అవకాశం ఉంటుంది. పౌర సరఫరా శాఖ అధికారులు వాహనదారులు సమాచారం ఇచ్చినపుడు పెట్రోల్ బంక్ లో శాంపిల్స్ సేకరించేందుకు పరిమితమవుతున్నరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మొక్కుబడిగా కేసులు నమోదు చేయకుండా, వినియోగదారులందరినీ మోసం చేసిన ఇలాంటి పెట్రోల్ బంక్ లను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు చేరేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.