బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

ఎస్ఎస్సీ విద్యార్థుల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లోక్ సభసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2023-04-05 15:31 GMT

దిశ, భూత్పూర్: ఎస్ఎస్సీ విద్యార్థుల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లోక్ సభసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ విలువలకు విరుద్ధంగా ప్రధానమంత్రిపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే ప్రశ్నాపత్రాల లీకేజీలతో రాజకీయాలకు పాల్పడుతూ అరెస్ట్ అయిన బండి సంజయ్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనవసరంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇలా నీచ రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఎప్పటికీ ఆదరించరనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూరు బసవరాజ్ గౌడ్, చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News