కేబుల్ వైర్ల ముఠా అరెస్టు…రూ. 4.50 లక్షలు రికవరీ

సోలార్ కేబుల్ వైర్ల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Update: 2024-09-20 14:38 GMT

దిశ, జడ్చర్ల / మిడ్జిల్ : సోలార్ కేబుల్ వైర్ల బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తో కలిసి జడ్చర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మిడ్జిల్ మండలంలోని మున్ననూరు వద్ద జాతీయ 167 వ రహదారిపై మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ముఠా గుట్టురట్టైంది. సోలార్ ప్లాంట్లలో లో కేబుల్ వైర్లను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఏడు చోట్ల దొంగతనాలు చేశారని, మిడ్జిల్ మండలంలో రెండుచోట్ల బోయినపల్లి, రాణిపేటలలో, ఆమన్ గల్, మానవపాడు, మక్తల్, అడ్డాకుల చిన్న చింతకుంట, అమంగల్, బోయిన్పల్లి, రాణి పేటలో దొంగతనాలకు పాల్పడిన 11 మంది ముఠాను గుర్తించామని తెలిపారు.

ముగ్గురుని శుక్రవారం అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు ఈనెల 10వ తేదీన రాత్రి బోయినపల్లి లోని సోలార్ ప్లాంట్ లో ఫెన్సింగ్ వైర్ కట్ చేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు బాలస్వామి, జయరాజులు తండ్రి కొడుకులు మరణించగా మిగతా 6 మంది పరారీలో ఉన్నారన్నారు. ఇందులో ప్రధాన సూత్రధారణ సుంకన్న పట్టుపడితే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ముఠాలోని సభ్యులంతా ఒకే కులానికి చెందినవారని వారి సొంత గ్రామం కర్నూలు జిల్లా డోన్ మండలం ద్రోణాచలం కాగ అక్కడినుండి వారిలో కొందరు మహబూబ్నగర్ జిల్లాలోని పెబ్బేరు, జడ్చర్ల, నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఏరియాలలో గుడిసెలు వేసుకుని సంచార జీవనం సాగిస్తున్నారన్నారు.

రాళ్లు వెంట తీసుకొని పోయి అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేసి, కట్టర్ సహాయంతో వైర్లను దొంగతనం చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఆటో ట్రాలీలో వైర్లను బ్యాటరీలను ఎత్తుకుపోయిన సామాన్లు స్క్రాప్ కింద అమ్మేసి వచ్చిన డబ్బులతో మరో కొత్తది, పెద్దది ట్రాలీ ఆటో కొనడానికి మహబూబ్నగర్ వెళ్తుండగా మిడ్జిల్ మండలం మున్నూరు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ.4.50లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులను రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా సరే దొంగతనాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.


Similar News